||సుందరకాండ ||

|| ఇదవ సర్గ తెలుగులో||



||ఓమ్ తత్ సత్||
తతస్స మధ్యంగత మంశుమంతమ్ జ్యోత్స్నావితానం మహదుద్వమంతమ్|
దదర్శ ధీమాన్దివి భానుమంతమ్ గోష్ఠే వృషం మత్తమివ బ్రమంతమ్||1||
స|| తతః సః ధీమాన్ మధ్యం గతం అంశుమంతం ఉద్యమంతం మహత్ జ్యోత్స్నావితానమ్ దివి భానుమంతం గోష్ఠే భ్రమంతం వృషమివ దదర్శ||
ఆప్పుడు ఆ ధీమంతుడు ఆకాశములో మధ్యభాగము చేరి మహత్తరమైన కాంతులను విరజిమ్ముచూ గోశాలలో మదమెక్కిన ఆంబోతులాగా ఉన్న చంద్రుని ని చూశెను.
||ఓమ్ తత్ సత్||

సుందరకాండ.
అథ పంచమ స్సర్గః

ఆప్పుడు ఆ ధీమంతుడు ఆకాశములో మధ్యభాగము చేరి మహత్తరమైన కాంతులను విరజిమ్ముచూ గోశాలలో మదమెక్కిన ఆంబోతులాగా ఉన్న చంద్రుడుని చూశెను.

హనుమంతుడు ముందుకు పోతూ లోకములో పాపాలని నాశనము చేయుటకా , మహా సాగరమును ఉప్పొంగించడానికా అన్నట్లు, సమస్త జీవులను విరాజమానము చేస్తున్నాడా అన్నట్లు కాంతులను విరజిమ్ము చున్న చంద్రుని చూచెను. భువిలోని మందరపర్వతము మీద ఉన్న ప్రకాశములాగా, సాగరములో ప్రదోషకాలములో ఉన్న ప్రకాశములాగ, తామరాకుమీద ఉన్న జలములోవున్న ప్రకాశము లాగా వున్న ప్రకాశమే చంద్రుని లో మహోజ్వలముగా కనపడుతున్నది.

ఆకాశములో చంద్రుడు రజత పంజరములో నున్న హంస లాగ, మందర పర్వతములోని గుహలలో వున్న సింహము లాగ , గర్వముతో ఏనుగపై నున్న వీరుడు లాగ విరాజిల్లెను. ఆకాశములో చంద్రుడు వాడికొమ్ములున్నవృషభము లాగా, మహోన్నత శిఖరాలున్న తెల్లని మహా పర్వతములాగా బంగారపు పూతగల్గిన తొడుగులతో దంతాలుకల ఏనుగు లాగా పరిపూర్ణకళలతో ప్రకాశిస్తున్నాడు. ఆకాశములో గొప్పకాంతితో స్పష్టముగానున్న మచ్చ కల చంద్రుడు మంచు తుంపరలమాలిన్యము తొలగి పోయిమెరుస్తున్న తుషారబిందువులాగ, మహాగ్రహముల వలనకలిగిన మాలిన్యముతొలగి ప్రకాశించువారిలాగ ప్రకాశిస్తున్నాడు.

చంద్రుడు శిలాతలము పైకెక్కిన మృగరాజము లాగ, మహారణము లో ప్రవేశించిన గజరాజు లాగా, రాజ్యాన్ని తిరిగి సంపాదించిన రాజు లాగా చంద్రుడు ప్రకాశించుచున్నాడు.

ప్రదోషకాలములో స్వర్గ ములను ప్రకాశింపచేసిన చంద్రుడి కాంతితో, చంద్రోదయముతో చీకటి నశించిపోయెను, మాంసభక్షకుల కౄరకర్మలు ఆగిపోయెను, ప్రియురాళ్ళు తమ తమ కోపములను వదిలేసి ప్రియులతో కలిపోయిరి. తంత్రీవాద్యములు చెవులకు సుఖమునిస్తున్నాయి. పవిత్రులగు సతీమణులు భర్తతో శయినిస్తున్నారు, చీకట్లలో తిరిగే రాక్షసులు విర్రవీగుతో తిరుగుచున్నారు.

ధీమంతుడు వీరుడు అయిన హనుమంతుడు శ్రియముతో కూడిన వారి ఇళ్ళలో మత్తమెక్కిన వారిని, రథములు అశ్వములు ఏనుగులు మంచి ఆసనములు గలవారిని చూచెను. వాళ్ళు పరస్పరము అధిక్షేపించుకుంటూ, భుజములు ఎగరవేసుకుంటూ , మత్తించిన ప్రేలాపములలో నున్న వారినీ, మత్తముతో పరస్పరము ఆక్షేపించుకొనుచున్నవారినీ చూచెను. హనుమంతుడు రాక్షసులలో తమ వక్షములు పెద్దగాచేసుకుంటూ కాంతల మీద పడుచున్నవారిని, ధృడమైన ధనస్సుని పట్టుకొనివున్నవారిని, చిత్రమైన రూపాలని ప్రదర్శిస్తున్నవారిని చూచెను

కాంతలలో కొందరు చందనానులేపనము చేసినవారు, కొందరు నిద్రించుచున్నవారు, మంచి రూపము ముఖము కలవారు, నవ్వుతూ ఉన్నవారు, కోపముతో ఉన్నవారు, కొంతమంది నిట్టూర్పులు విడుస్తున్నవారు వున్నారు

ఆ నగరము మహాగజములతోనూ మహాపురుషులతోనూ ప్రకాశించుచున్నది. దీర్ఘనిశ్వాసములు విడుస్తున్న వీరులతో ఆ నగరము బుసలు కొట్టుచున్న సర్పములుకల లాగా వెలుగుచున్నది. ఆ నగరములో జగత్తులో ప్రధానులై, బుద్ధిజీవులైనవారిని మనోహరమైన వాక్కుకలవారిని, శ్రద్ధకలవారిని అనేకవిధములైన వారిని చూచెను.

హనుమంతుడు మంచిరూపము గుణములతో తమగుణములకు అనుగణముగా ప్రవర్తిస్తున్నవారిని చూచి ఆనందపడెను. అలాగే కొంతమంది వికృతరూపముగలవారిని, వారిరూపానుసారము ప్రవృత్తులుకల వారిని చూచెను. అప్పుడు అక్కడ శ్రేష్టమైన ఆభరణములతో ఉత్తమోత్తమ రూపము గలవారిని, శుద్ధమైన అంతఃకరణము కలవారిని, గొప్పప్రభావము కలవారిని, ప్రియులయందు పానమునందు ఆసక్తి కలవారిని చూచెను. వారిలో తారలవలె ప్రకాశిస్తున్నవారిని కూడా చూచెను. రాత్రిసమయములో ప్రియులకౌగిళ్ళలో కాంతితో ప్రకాశిస్తూ , కొందరు పుష్పములతో అలంకరింపబడి ప్రియులకౌగిలింతలలో సంతోషము గా విహరిస్తున్నపక్షులవలె నున్న వారిని చూచెను. ధీమంతుడగు హనుమంతుడు మేడల పైభాగలపై ప్రియుల అంగములలో సుఖముగా కూర్చుని ఉన్న మన్మధావేశమునకు ఒరిగిన స్త్రీలను, భర్తసేవలలో ధర్మమార్గములో పోవుచున్న స్త్రీలను చూచెను. కొందరు సిగ్గులేకుండా కామక్రియలలో ఉన్నవారిని, బంగారపురంగు కలిగినవారిని, అత్యంత అనందము కలిగించు వారిని , కొందరు ప్రియుడు లేకుండా కాంతి విహీనముగానున్నవారిని, కోందరు అందమైన అవయవములు కలవారిని చూచెను.

ఆ హరిప్రవీరుడు ఆ గృహములలో ప్రియులను పొంది మనస్సులో ఆహ్లదముపొందిన, మంచి ప్రీతికలిగిన, చూచి ఆనందము పొందిన, అత్యంత సుఖము సంతోషము పొందిన స్త్రీలను చూచెను. చంద్రునివలె ప్రకాశిస్తున్న ముఖము కలవారిని, వంకరగావున్న కళ్ళరెప్పలతో అందమైన కళ్ళుగలవారిని గలవారిని, అందమైన మాలలవలే ఆభరణముతో అలంకరింపబడిన వారిని చూచెను.

కాని రాజకులములో పుట్టి ధర్మమార్గములో పెరిగినది , విరాజిల్లు తీగవలెనున్న కోమలమైన శరీరముగల, తనంటతనే జన్మించిన సీతాదేవిని మాత్రము చూడలేదు. సనాతధర్మముని అనుసరించు , రామునియందే దృష్టిగలది, భర్తపై మనస్సుగలది, రామునికై తపించుచున్నది, స్త్రీలలో ఉత్తమోత్తమమైనది అగు ఆ సీతను చూడలేదు. విరహతాపములోనున్నదానిని, నిరంతరముగా భాష్పములుకంఠములో గలది, అమూల్యమైన నిష్కమును కంఠములో ధరించినది, అందమైన కనురెప్పలు గలది, మధురమైన కంఠము కలది, వనములో నాట్యముచేయని నీలఖంఠముకలనెమలి వలెనున్నది ఆగు ఆ సీతను చూడలేదు. కనికనపడిన చంద్రరేఖవలెనున్న, మట్టిచే కప్పబడిన బంగారుతీగవలె, బాణముచే గాయపడిన గుర్తుగా మిగిలిన మచ్చవలే , వాయువుచే చెదిరిన మేఘములవలె నున్న సీతను మాత్రము చూడలేదు.

మాటలలో నేర్పరి మనుష్యులలో శ్రేష్టుడు అగు రాముని భార్యని చాలాకాలము వెదికినప్పటికీ కానక ఆ పవనాత్మజుడు దుఃఖముతో కొంతకాలము నిరాశానిశ్పృహలకు లోనయ్యెను.

ఈ విధముగా వాల్మీకి రామయణములోని సుందరకాండలోఇదవ సర్గ సమాప్తమయ్యెను.

||ఓమ్ తత్ సత్||
శ్లో|| సీతామపశ్యన్ మనుజేశ్వరస్య రామస్య పత్నీం వదతాం వరస్య|
బభూవ దుఃఖాభిహతః శిరస్య ప్లవఙ్గమో మంద ఇవా చిరస్య ||27||
స|| వదతాం వరస్య మనుజేశ్వరస్య రామస్య పత్నీం అచిరస్య అపశ్యన్ ప్లవంగమః దుఃఖాభిహితః చిరస్య మంద ఇవ బభూవ||
తా|| యుక్తియుక్తముగా మాట్లాడుటలో నేర్పరి అయిన , మానవులకు రాజు అయిన, రాముని యొక్క భార్యని చాలాసేపు వెదికినప్పటికీ కారాకపోవడము చేత హనుమ అమిత దుఃఖముతో మందబుద్ధి కలవాని వలె అయ్యెను.
||ఓమ్ తత్ సత్||